Vision & Mission

Vision & Mission

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు వంటి అంశాల సర్వతోముఖాభివృద్ధికోసం కింది లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు నిరంతరం కృషి సల్పుతున్నది.

  1. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి రంగాల్లో విశ్వవిద్యాలయం ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా పనిచేయడం
  2. తెలుగు భాషా సాహిత్య చరిత్ర, సంస్కృతులనూ, అందుకు సంబంధించిన విషయాలనూ అధ్యయనం చేయదలచిన భారతదేశంలోని వారికి, విదేశాల్లోని వారికి శిక్షణ ఇవ్వడం
  3. కళలు, సంస్కృతి, సంగీతం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద విజ్ఞానం, జానపద కళలు, జ్యోతిషం, పురావస్తు శాస్త్రం, సాహిత్యం, వ్యాకరణం, భాషా శాస్త్రం, చరిత్ర, మతం, వేదాంతం, వైద్యం, ఇంజనీరింగు, విజ్ఞాన శాస్త్రాలు, హస్తకళలు మొదలైన వాటిల్లో ఉన్నత అధ్యయనానికీ, పరిశోధనకూ వీలు కల్పించడం
  4. విశ్వవిద్యాలయ లక్ష్యాలకు అనుగుణమైన అవసరాల ప్రకారం తెలుగు పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువదించడం, ఇతర భాషల్లోని పుస్తకాలను తెలుగులోకి అనువదించడం
  5. తెలుగుభాషకు, సంస్కృతికి, చరిత్రకు సంబంధించిన శిలాశాసనాలను అన్వేషించడం, వాటిని సంకలనం చేయడం, పరిశోధన ఆధారంగా వెల్లడైన అంశాలతో వాటిని ప్రచురించడం
  6. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగు మాట్లాడేవారు, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో నివసిస్తూ తెలుగు మాట్లాడేవారు, పరిశ్రమలు, ఇతర వృత్తులకు సంబంధించి ఉపయోగించే తెలుగు మాటలు, నుడికారం, వ్యావహారిక పదజాలం, కొత్తగా ఎప్పటికప్పుడు రూపొందే పదాలను సంకలనం చేయడం, ప్రచురించడం
  7. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రాచీన తెలుగు సాహిత్యంపై పరిశోధనలకు వీలు కల్పించడం
  8. తెలుగును ఆధునిక విజ్ఞాన భాషగానూ, బోధన భాషగానూ అభివృద్ధి పరచడం. భాషాభివృద్ధి గురించిన పరిశోధనకు సదుపాయాలు కలుగచేయడం, కార్యవిధానాలను నిర్ణయించడం, అందుకు తగిన పద్ధతులను రూపొందించడం.