Ph.D.Admissions

Ph.D.Admission and other Rules & Regulations with effect from 2017-2018

1.  తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఆర్ట్స్, కామర్స్, మేనేజ్ మెంట్, విద్య, న్యాయశాస్త్రం, సామాజిక శాస్త్రాలు, ప్రాచీన భాషలు, విజ్ఞానశాస్త్రం, టెక్నాలజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, ఇన్ఫర్ మేటిక్స్, లలితకళలు, ఆర్కిటెక్చర్ మరియు భవిష్యత్తులో ప్రకటించే వివిధ విషయాలలో పిహెచ్.డి డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి కింద పేర్కొన్న మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలను అనుసరించడం జరుగుతుంది. ఎం.ఫిల్/పిహెచ్.డి డిగ్రీలను ప్రదానం చేయడానికి ఈ కనీస నియమ నిబంధనలు కింద పేర్కొన్న విధానం అనుసరించడం జరుగుతుంది.

2. పిహెచ్.డి కోర్సులో ప్రవేశానికి అర్హత. అన్ని విభాగాలలోను, పిహెచ్.డి రిజిస్ట్రేషను/ప్రవేశం పొందడానికి అర్హతాప్రమాణాలు.

        2.1  అభ్యర్ధి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్టు గ్రాడ్యుటేడు డిగ్రీ పొంది ఉండాలి లేదా దూరవిద్య పద్ధతిలో (ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగాలకు ఇదివర్తించదు) సంబంధిత సబ్జక్టులో లేదా అనుబంధ సబ్జక్టులో 55% మార్కులకు తక్రువకాకుండా లేదా తత్సమానమైన సిజిపిఏ (CGPA)తో పోస్టు గ్రాడ్యుయేటు డిగ్రీని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పొంది ఉండాలి. (ఎస్.సి/ఎస్.టి/పిహెచ్ అభ్యర్ధులు 50% మార్కులకు తగ్గకుండా లేదా తత్సమాన సిజిపిఏ పొంది ఉండాలి). ఒకవేళ పోస్టు గ్రాడ్యుయేటు డిగ్రీ ఫలితాలు మార్కుల కార్డులు/ట్రాన్స్ క్రిప్ట్ లలో గ్రేడ్లు/క్రెడిట్లు/కుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ లో ఇచ్చినట్లయితే ఆ గ్రేడ్లను/పాయింట్లను మార్కుల శాతంలోకి మార్చి కనీస అర్హత ప్రమాణాలను అంచనా వేయడం జరుగుతుంది.

                                                                                                                       మరియు

      2.2  సంబంధిత విషయం (సబ్జక్టులో)లో అభ్యర్ధి ఏదేని జాతీయ స్థాయి సంస్థ అంటే యుజిసి, సిఎస్ఇఆర్, ఐసిఎఆర్, ఐసిఎంఆర్ డిబిటి(UGC, CSIR, ICAR, ICMR, DBT) వంటివి నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్ష ద్వారా పరిశోధన ఫెలోషిప్ పొంది ఉండాలి. లేదా సంబంధిత అధికారుల అనుమతి పొందిన టీచర్ ఫెలోషిప్ అభ్యర్ధులైనా అయి ఉండాలి.

                                                                                                                            లేదా

      2.3  సంబంధిత విషయంలో యుజిసి నెట్/సిఎస్ఐఆర్ నెట్/సెట్-టిఎస్/ఎపి/జెస్ట్/గేట్/ జిపిఏటి పరీక్షలో కృతార్ధులై ఉండాలి.

                                                                                                                             లేదా

      2.4  రెగ్యులర్ విధానంలో సంబంధిత విషయంలో ఎం.ఫిల్ డిగ్రీ పొంది ఉండాలి.

      2.1 నుంచి 2.4 వరకు నియమాల్లో చెప్పిన అర్హతలు ఒకటి లేదా అంతకన్న ఎక్కువగా కలిగిన అభ్యర్ధికి పిహెచ్.డి కోర్సులో ప్రవేశం లభిస్తుందని హామీ లేదు. సంబంధిత శాఖలోని పరిశోధన పర్యవేక్షకుల వద్ద ఉన్న ఖాళీలను బట్టి, అభ్యర్ధుల విద్యాత్మక రికార్డును బట్టి, పిహెచ్.డి ప్రవేశాలకు జరిగే మౌఖిక పరీక్షలో అభ్యర్ధి కనబరిచే ప్రతిభను బట్టి ఇది నిర్ధారితమవుతుంది.

       2.5  విదేశీ విద్యార్ధికి ప్రవేశార్హత. విదేశాలలో పిజి కోర్సు చేసిన విద్యార్ధి/భారతదేశంలోని విశ్వవిద్యాలయంలో పిజి చేసిన విద్యార్ధికి పిహెచ్.డి ప్రవేశార్హతను పిజిలో విద్యార్ధి చదివిన పాఠ్యప్రణాళిక, దానిలోని విషయాన్ని బట్టి సంబంధిత సబ్జక్టుకు చెందిన పిహెచ్.డి అడ్మిషన్ కమిటీ నిర్ణయిస్తుంది.

తరువాత అతడు/ఆమె సంబంధిత విభాగంలోని డీన్ కు సమగ్రమైన పరిశోధన ప్రతిపాదనతో పాటుగా దరఖాస్తును సమర్పించాలి. విశ్వవిద్యాల విదేశీ సంబంధాల అధికారి అనుమతించిన తర్వాత పిహెచ్.డి కోర్సులో ప్రవేశం లభిస్తుంది. 2.2. నుంచి 2.4 నియమాలలో పేర్కొన్న పరీక్షను విదేశీ విద్యార్ధులు పాసవనవసరం లేదు. 

3. పిహెచ్.డి ప్రవేశాలు:

3.1  పిహెచ్.డి కోర్సులకు విశ్వవిద్యాలయం దరశాస్తులు ఆహ్వానించినపుడు అభ్యర్ధులు నిర్దేశిత దరఖాస్తు పత్రంతో పాటుగా నిర్దేశిత ఫీజును చెల్లించి దరఖాస్తు సమర్పించాలి. ఖాళీలనుబట్టి డిపార్ట్ మెంటల్ రిసెర్చ్ కమిటీ అభ్యర్ధుల దరఖాస్తులు పరిశీలించి పిహెచ్.డి మౌఖిక పరీక్షకు అభ్యర్ధులను పిలుస్తుంది.

3.2  పిహెచ్.డి అడ్మిషన్ కమిటీ. పిహెచ్.డి కోర్సులోకి అభ్యర్ధులను ఎంపిక చేయడానికి ప్రతి సబ్జక్టులోను అభ్యర్ధులను ఎంపిక చేయడానికి ప్రతి సబ్జక్టులోను ‘‘పిహెచ్.డి అడ్మిషన్ కమిటీ’’ ఉంటుంది. సంబంధిత సబ్జక్టుకు చెందిన పీఠాధిపతి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. శాఖాధిపతి, బిఓఎస్ ఛైర్ పర్సన్, శాఖలోని ముగ్గురు సీనియర్ పిహెచ్.డి పర్యవేక్షకులు సభ్యులుగా ఉంటారు. ఒకవేళ సంబంధిత శాఖలో గుర్తింపు పొందిన పర్యవేక్షకులు లేని పక్షంలో పర్యవేక్షకులుగా గుర్తింపు పొందిన వారిని అనుబంధ సబ్జక్టు నుంచి గాని బయటి విషయ నిపుణుల నుంచి గాని పీఠాధిపతి చేర్చవచ్చు. విశ్వవిద్యాలయాలు పై విధంగా కాకుండా తమ విధి విధానాల ద్వారా స్వంతంగా పిహెచ్.డి ప్రవేశా కమిటీ నియమించుకోవచ్చు.

3.3. పిహెచ్.డి కోర్సు ప్రవేశం/రిజిస్ట్రేషన్ కింద పేర్కొన్న రెండు రకాలుగా జరుగుతుంది.

3.3.1  మొదటి వర్గం (రిసెర్చ్ ఫెలోషిప్ పొందినవారు)

మొదటి రకానికి చెందిన అభ్యర్ధులు – జాతీయస్థాయి పరీక్షలో అంటే యుజిసి, సిఎస్ఐఆర్, ఐసిఎఆర్, ఐసిఎంఆర్,డిబిటి మొదలగు సంస్థలు నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో రిసెర్చ్ ఫెలోషిప్ పొంది ఉండాలి. లేదా టీచర్ ఫెలోషిప్ ఉన్న అభ్యర్ధులైతే సంబంధిత అధికారుల అనుమతి పొంది ఉండాలి ఈ అభ్యర్ధులకు నేరుగా పిహెచ్.డి కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.

                  ఈ అభ్యర్ధులను పిహెచ్.డి కోర్సులో చేర్చుకునే విధానం.

          ఎ) మొదటి రకానికి చెందిన అభ్యర్ధులకు పిహెచ్.డి కోర్సులో ప్రవేశం కల్పించడానికి సంబంధిత పీఠాధిపతి ఒక విద్యా సంవత్సరంలో రెండు సార్లు ప్రకటన ఇస్తారు.

         బి)   రిసెర్చ్ ఫెలోషిప్ ఉన్న అభ్యర్ధి తన దరఖాస్తును పూర్తిచేసి, సమగ్రమైన పరిశోధన ప్రతిపాదనతో  పాటుగా సంబంధిత పీఠాధిపతికి సమర్పించాలి.

         సి)     అటువంటి అభ్యర్ధులకు పిహెచ్.డి అడ్మిషన్ కమిటీ మౌఖిక పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో  అభ్యర్ధి ప్రతిభకు సంతృప్తి చెందినపుడు కమిటీ అతడు/                    ఆమెకు పరిశోధన పర్యవేక్షకుడిని నియమిస్తుంది. ఫెలోషిప్ ఉన్నవారికన్న ఖాళీలు తక్కువ ఉంటే, అర్హమైనపి.జి పరీక్షలో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి మెరిట్ జాబితా తయారు చేస్తారు.

       డి)     పీఠాధిపతి సంబంధిత శాఖలతో సంప్రదించి పరిశోధన పర్యవేక్షకులకు అభ్యర్ధులను కేటాయిస్తారు.

       ఇ)    అభ్యర్ధులు ఒక సెమెస్టర్ పిహెచ్.డి కోర్సు వర్క్ చేయాలి. దీనిలో సిద్ధాంతం (థీయరీ) పేపర్లు రెండు ఉంటాయి. ఈ పిహెచ్.డి. కోర్సువర్క్ పరీక్షలో అభ్యర్ధి                  ఉత్తీర్ఱుడవ్వాలి.

     ఎఫ్)   మొదటి వర్గానికి చెందిన పిహెచ్.డి కోర్సులో చేరిన అభ్యర్ధులు పూర్తికాలిక పరిశోధక  విద్యార్థులుగా ఉండాలి.

              (చూడండి-పూర్తికాలిక, పాక్షిక పరిశోధక విద్యార్థులకు సంబంధించిన నియమాలు-5)

3.3.2. రెండవ వర్గం అభ్యర్ధులు:

యుజిసి-నెట్/సిఎస్ఐఆర్-నెట్/సెట్-టిఎస్/ఏపి/జెస్ట్/గేట్/జిపిఏటి పరీక్షలలో సంబంధిత విషయాలలో అర్హులైనవారు లేదా సంబంధిత విషయంలో రెగ్యులర్ పద్ధతిలో ఎం.ఫిల్ డిగ్రీ పొందినవారు రెండవరకం అభ్యర్థులు.

ఈ అభ్యర్ధులకు పిహెచ్.డి కోర్సులో ప్రవేశం లభించే విధానం.

    ఎ)  విశ్వవద్యాలయం రెండవవర్గం అభ్యర్ధులు పిహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనమన ప్రకటన  జారీ చేస్తుంది. పీఠాధిపతి సంబంధిత శాఖకు దరఖాస్తులను పంపి అభ్యర్ధి అర్హతలను పరిశీలింపజేస్తారు. అర్హులైన అభ్యర్ధులను పిహెచ్.డి ప్రవేశ కమిటీ మౌఖిక పరీక్షకు పిలుస్తుంది.

   బి)  ఈ మౌఖిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు సమగ్రమైన పరిశోధన ప్రతిపాదన సమర్పించాలి.

   సి)  ప్రతి అభ్యర్ధిని పరిశోధన ప్రతిపాదనకు సంబంధించి, సంబంధిత విషయంలో పరిజ్ఞానానికి సంబంధించి  ప్రశ్నలు వేసి పరీక్షిస్తారు. అభ్యర్ధి సంతృప్తికరంగా సమాధాన మిస్తే, ఎంపిక అయినపక్షంలో అభ్యర్ధికి పరిశోధన పర్యవేక్షకుడిని కేటాయించవలసిందిగా కమిటీ సిఫారసు చేస్తుంది.

3.3  రెండవవర్గం అభ్యర్ధుల ప్రవేశ అర్హతా ప్రమాణాలు. విద్యాత్మక ప్రతిభకు, పోటీ పరీక్షలకు, మౌఖిక పరీక్షలలో కనబరిచిన ప్రతిభకు మొత్తం కలిపి 50 మార్కులు. వాటి విభజన కింద విధంగా ఉంటుంది.

పిజిస్థాయిలో విద్యాత్మక ప్రతిభ    (గరిష్ఠ మార్కులు 10)

70%             ఆపైన                    10

60%   –      70% కన్న తక్కువ    08

50%   –      60% కన్న తక్కువ    06     

పోటీ పరీక్షలు (గరిష్ఠ 25 మార్కులు)

యుజిసి-నెట్/సిఎస్ఐఆర్-నెట్/గేట్/జిపిఏటి          :         25 మార్కులు

సెట్-టిఎస్/ఏపి/జెస్ట్/ఎం.ఫిల్                       :         20 మార్కులు

     (ఎం.ఫిల్ ను రెగ్యులర్ పద్ధతిలో చేసి ఉండాలి)

ఒకవేళ అభ్యర్ధి గనుక ఒక పరీక్షలోకన్న ఎక్కువ పరీక్ష్లలో అర్హత సాధించిన పక్షంలో గరిష్ఠ మార్కులున్న పరీక్షను మార్కులు వేయడానికి గ్రహించడం జరుగుతుంది.

పరిశోధన అనుభవం        : (గరిష మార్కులు 10)

ప్రాజెక్టు ఫెలో                  : ఒక ఏడాది అనుభవానికి 03 మార్కులు

             (ప్రాయోజిత పరిశోధన ప్రాజెక్టులు)

పరిశోధనాత్మక ప్రచురణలు: ఒక్కో పత్రానికి 01 మార్కు

            (దరఖాస్తు చేసే చివరి తేదీ నాటికి)

(పరిశోధనాత్మక ప్రచురణలు యుజిసి గుర్తింపు పొందిన ఐఎస్ఎస్ఎన్/ఐఎస్ బిఎన్ నంబర్లున్న జర్నల్స్ లోనివై ఉండాలి)

          పరిశోధన ప్రతిపాదన మరియు మౌఖిక పరీక్షలో ప్రతిభ- (గరిష్ఠ మార్కులు 05)

గమనిక: పొందిన మొత్తం మార్కులు సమానంగా ఉంటే అర్హతా పరీక్షలో అత్యధిక శాతంమార్కులు వచ్చిన అభ్యర్ధికి ప్రవేశం లభిస్తుంది. అప్పుడు కూడా ప్రతిష్టంభన ఏర్పడితేవయసులో ఎవరు పెద్దవారైతే వారికి ప్రవేశం లభిస్తుంది.

3.4. పిహెచ్.డి ప్రవేశానికి ఇతర నియమాలు:

  ఎ)     ఆ ఏడాదిలో ప్రతి సబ్జక్టుకు పిహెచ్.డి ప్రవేశానికి మొత్తం ఖాళీలను పీఠాధిపతి ప్రకటిస్తారు. మొదటి రకం కింద పిహెచ్.డి ప్రవేశాలు పూర్తిగానే మిగిలిన సీట్లను రెండవవర్గం అభ్యర్ధులతో పైన తెలిపిన  పద్ధతిలో సీట్లు నింపుతారు.

  బి)     రెండవవర్గం విద్యార్థులకు తెలంగా రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నియమాల ప్రకారం పిహెచ్.డి  కోర్సులో ప్రవేశం కల్పించడం జరుగుతుంది. రిజిర్వేషను కోసం శాఖను ఒక యూనిట్ గా పరిగణిస్తారు.

  సి)      పిహెచ్.డి కోర్సులో చేరిన రెండవవర్గం అభ్యర్ధులు పూర్తికాలిక లేదా అంశకాలిక పరిశోధక విద్యార్ధులుగా ఉండవచ్చు.

            (పూర్తికాలిక, అంశకాలిక పరిశోధక విద్యార్ధులకు సంబంధించిన నియమాలనునియమం-5లో చూడవచ్చు).

3.5. వృత్తి నిపుణలు, విదేశీ స్కాలర్ల విద్యార్ధుల పిహెచ్.డి ప్రవేశాలు:

ఎ)     విదేశీ విద్యార్థులు: విశ్వవిద్యాలయ విదేశీ సంబంధాల అధికారి (UFR) లేదా విశ్వవిద్యాలయంలో ఇటువంటి వ్యవహారాలు చేసే అధికారి మరియు సంబంధిత    డిపార్ట్మెంటల్  రిసెర్చ్ కమిటీ చేసిన  సిఫారసులను ఆధారం చేసికొని ఇద్దరు అర్హులైనవిదేశీ స్కాలర్లకు సీట్లు కేటాయిస్తారు. వీరిని ఒక్కో పర్యవేక్షకుడికి సూపర్ న్యూమరరీ  పద్ధతిలో  కేటాయించవచ్చు.

బి)      కార్పొరేట్/పారిశ్రామిక నిపుణులు ఇతర అధికారులు మొదలగు వారు:ప్రభుత్వం/కార్పొరేటు/పరిశ్రమలు మరియు విశ్వవిద్యాలయం మధ్య సహకారం పెంపొందించే ఉద్దేశంతో కింద పేర్కొన్న వర్గాల నుంచి ఒక్క అర్హుడైన అభ్యర్ధిని ప్రతి    పర్యవేక్షకుడికి సూపర్ న్యూమరరీ పద్ధతిలో కేటాయించవచ్చు.

  1. జాయింట్ సెక్రటరీ హోదాకు తగ్గని ప్రభుత్వ ఉద్యోగులు
  2. జాతీయస్థాయి శాస్త్రీయ సంస్థలలోని సైంటిస్ట్-ఎఫ్ కన్న తక్కువ ర్యాంకులో లేని సైంటిస్టులు/పరిశోధకులు
  1. జాతీయ / రాష్ట్ర స్థాయి ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలలో జనరల్ మేనేజర్ ర్యాంకుకు తక్కువకాని వృత్తినిపుణులు
  1. సర్వీసులు ఉన్న రక్షణ సిబ్బంది వింగ్ కమాండర్/కెప్టెన్ (నేవీ)/కల్నల్ స్థాయిర్యాంకుకు తగ్గని వారు.
  1. టర్నోవరు రూ.100 కోట్లకు తగ్గని  ప్రయివేటు సంస్థలలో పనిచేస్తున్న వైస్ ప్రెసిడెంట్   హోదాకు తగ్గని వారు.
  1. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి హోదాలో పనిచేస్తున్న న్యాయమూర్తులు.

ఈ అభ్యర్థులు సంబంధిత విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు ఫీజులనుచెల్లించవలసివుంటుంది ఈ అభ్యర్థులు పరిశోధన ప్రతిపాదన మరియు సంబంధిత ధ్రువపత్రాలను పీఠాధిపతికి   సమర్పించిన పిమ్మట డిపార్ట్‌ మెంటల్ రిసెర్చ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశం ఉంటుంది.ఈ రెండు వర్గాల అభ్యర్ధులకు 2.2 నుంచి 2.4 వరకు గల నిబంధనలలో   పేర్కొన్న అర్హత పరీక్షలు అవసరం లేదు.

4. పరిశోధన పర్యవేక్షకులకు పరిశోధకులను కేటాయించడం:

4.1. విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు పరిశోధన పర్యవేక్షకులుగా గుర్తింపు పొందిన పూర్తికాలిక బోధన సిబ్బంది మాత్రమే పర్యవేక్షకులుగా వ్యవహరించగలరు. ఎక్స్ టర్నల్ పర్యవేక్షకు(External Supervisors) లకు అనుమతి ఉండదు. అయితే విభాగాంతర విషయాలలో (Inter disciplinary areas) పరిశోధనకు అవసరమైనపుడు, అదే విశ్వవిద్యాలయంలోని ఇతర శాఖల నుంచికాని, సంబంధిత శాఖ అనుమతితో ఇతర విశ్వవిద్యాలయాలు/సంస్థల నుండి పర్యవేక్షకుడిని అనుమతిస్తారు.

4.2. ఎంపిక చేసిన పరిశోధకులకు పర్యవేక్షకులను కేటాయించే విషయంలో పర్యవేక్షకుని వద్ద అప్పటికే పరిశోధన చేస్తున్న పరిశోధకుల సంఖ్య, పర్యవేక్షకుల విషయ నిపుణత, మౌఖిక పరీక్షలో అభ్యర్ధి వెల్లడించిన పరిశోధన విషయాసక్తులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

4.3. ప్రొఫెసర్ అయిన పరిశోధన పర్యవేక్షకుడు/సహ పర్యవేక్షకుడు ఏకకాలంలో ఎనిమిది మంది (8) పిహెచ్.డి. పరిశోధకులకు మాత్రమే పరిశోధన పర్యవేక్షకుడిగా ఉండగలరు. అసోసియేట్ ప్రొఫెసర్ ఏకకాలలంలో ఆరుగురు (6) పిహెచ్.డి విద్యార్థులకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకకాలంలో నలుగురు (4) పిహెచ్.డి. విద్యార్ధులకు పర్యవేక్షకులుగా ఉండగలరు.

4.4. నిబంధన 3.5 మేరకు ఎంపిక చేసిన సూపర్ న్యూమరరీ కోటాలో రీసెర్చ్ స్కాలర్లను   పర్యవేక్షకుడికి అదనపు సీటుగా కేటాయించవచ్చు.

4.5. ఒక విద్యా సంవత్సరంలో పిహెచ్.డి. అడ్మిషన్ కమిటీ ఒక పర్యవేక్షకుడికి వారికి  నిర్దేశించిన గరిష్ఠ సంఖ్యలో సగానికి మించి ఎక్కువ మంది పరిశోధకులను     కేటాయించరాదే.

 4.6. పర్యవేక్షకులకు కేటాయించబడిన అభ్యర్థులు వారి బంధువులు కాదని పిహెచ్.డి  ప్రవేశకమిటీ నిర్ధారించుకోవాలి.

  4.7. పరిశోధక విద్యార్ధి పిహెచ్.డి సిద్ధాంతవ్యాసం సమర్పించనప్పుడు గానీ, పిహెచ్.డి. విద్యార్ధి  నమోదు రద్దు అయినపుడుగానీ మాత్రమే పర్యవేక్షకుల వద్ద ఖాళీ ఏర్పడినట్లుగా భావించాలి.

5. పిహెచ్.డి పరిశోధకులు- కేటగిరీలు

5.1. పూర్తికాలిక పిహెచ్.డి. విద్యార్థులు:

ఎ. పూర్తికాలికంగా నమోదు చేసుకున్న పిహెచ్.డి విద్యార్థులు కోర్సు కాల వ్యవధి మొత్తం పరిశోధనకే కేటాయించాలి. ప్రొగ్రాంలో కేటగిరి-1లో ప్రవేశం పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తికాలిక పరిశోధకులుగా పనిచేయాలి.

బి. పూర్తికాలిక పిహెచ్.డి కోర్సు చేసే విద్యార్థికి కోర్సు కాలవ్యవధి పీఠాధిపతి ప్రవేశ ఉత్తర్వు ఇచ్చిన తేదీ నుంచి కోర్సు వర్క్ తో కలిపి కనీసం మూడు (3) సంవత్సరాలు ఉంటుంది.గరిష్ఠంగా అయిదు (5) సంవత్సరాలు ఉంటుంది.

సి.  పూర్తికాలిక పరిశోధక విద్యార్ధి కోర్సు కాలవ్యవధిలో ఎటువంటి ఉద్యోగం చేయరాదు.అయితే,  పరిశోధన/కన్సల్టెన్సీ పథకాల్లో పనిచేయడం ఉద్యోగం చేస్తున్నట్లుగా పరిగణించబడదు.

డి.  ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారు పూర్తి కాలిక పిహెచ్.డి విద్యార్థులుగా చేరదలచుకుంటే,  ప్రవేశం పొందుతున్న తరుణంలోనే సంస్థ యజమాని నుంచి

పిహెచ్.డి కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన సెలవు మంజూరు చేయడం జరుగుతుందని అనుమతి పత్రాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించవలసి ఉంటుంది.

ఇ.   పూర్తికాలిక విద్యార్థులకు భోజనంతో సహా వసతి హాస్టల్ లో ఉన్న ఖాళీలను బట్టి గరిష్ఠంగా 5 సంవత్సరాలు కాని, పరిశోధన వ్యాసం సమర్పించే సమయం వరకూ కానీ (ఏది ముందయితే అది),  సమకూర్చడం జరుగుతుంది. ఇందు నిమిత్తం ప్రతి ఆరు(6) మాసాలకు ఒకసారి విద్యార్ధి ప్రగతి సంతృప్తికరంగా ఉన్నదని పర్యవేక్షకుల నుంచి, పీఠాధిపతి నుంచి ధ్రువపత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. విద్యార్ధి వేతనం పొందుతున్న పొందుతున్న విద్యార్ధులకు ఇంటి అద్దెభత్యం (HRA) చెల్లించబడదు.

గమనిక:  పైన పేర్కొన్న విధంగా హాస్టల్ వసతి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధన పర్యవేక్షకుల వద్ద పరిశోధన కొనసాగిస్తున్న వారికి మాత్రమే వసతి లభ్యతను బట్టి  ఉంటుంది. వేరొక విశ్వవిద్యాలయంలోని పరిశోధక పర్యవేక్షకుడి పర్యవేక్షణలో  పరిశోధన చేస్తున్నవారికి, సహపర్యవేక్షకుడు మొదటివిశ్వవిద్యాలయలో పనిచేస్తున్పప్పటికీ, హాస్టల్ సౌకర్యం ఉండదు.

6. పిహెచ్.డి. కోర్సు వర్క్ – పరీక్ష

6.1. పిహెచ్.డి కోర్సులో నమోదు చేసుకున్న పూర్తికాలిక, అంశకాలిక విద్యార్థులు తమ తమ శాఖలలో ఒక సెమెస్టర్ కోర్సువర్క్ తరగతులకు హాజరుకాలసి ఉంటుంది. ఇది కేటగిరి-1, కేటగిరి-2 విద్యార్థులకు తప్పనిసరి. రెగ్యులర్ పద్ధతిలో ఎం.ఫిల్ డిగ్రీ పొందిన విద్యార్థులు పిహెచ్.డి కోర్సువర్క్ నుంచి, కోర్సువర్క్ పరీక్ష నుంచి మినహాయింపుకు అర్హులు.

6.2. పిహెచ్.డి కోర్సువర్క్ లో పరిశోధన సిద్ధాంతానికి సంబంధించిన రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదానికి 60 గంటల ప్రత్యక్ష బోధన ఉంటుంది.

పేపర్-1: పరిశోధన పద్ధతులు (4క్రెడిట్స్): ఒక శాఖలోని అభ్యర్ధులకు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఈ పేపర్ కు చెందిన పాఠ్యప్రణాళికలో క్వాంటిటేటివ్ పద్ధతులు (Quantitative methods) (పరిమాణాత్మక పద్ధతులు), కంప్యూటర్ అప్లికేషన్స్, పరిశోధన నైతికత, పరిశోధన విషయ సంబంధమైన పరిశోధన నైపుణ్యాలు/పద్ధతులు మొదలైనవి ఉంటాయి.

పేపర్-2: పరిశోధనాంశ విస్తృత అధ్యయనం (4 క్రెడిట్లు): ఈ పాఠ్య ప్రణాళికలో ఆయా ప్రత్యేక విస్తృత పరిశోధనాంశాలకు సంబంధించిన సమకాలీన భావనలు, ధోరణుల అధ్యయనం ఉంటుంది. ఈ విస్తృత అధ్యయనం 5 ప్రత్యేక అంశాలకు పరిమితమై ఉంటుంది.

     అభ్యర్ధి పిహెచ్.డి కోర్స్ వర్క్ పేపర్లలో పరీక్షరాసి ఉత్తీర్ణతపొందాలి.

6.3. అంశకాలిక /పూర్తికాలిక అభ్యర్థులకు ప్రతి పేపర్లోను కనీసం 75 శాతం హాజరు ఉంటేనే పిహెచ్.డి కోర్సువర్క్ పరీక్షరాయడానికి అర్హులు.

6.4. విశ్వవిద్యాలయంలోని అన్ని శాఖలకు కోర్సువర్క్ పాఠ్యప్రణాళిక, ప్రశ్నపత్రాల నమూనా ఒకే విధంగా ఉంటుంది.

6.5. ప్రీ పిహెచ్.డి కోర్సువర్కు పరీక్షలు అన్ని సబ్జక్టులకు ఇంగ్లీషు మాధ్యమంలో ఉంటాయి. అయితే అధికారిక బోధన మాధ్యమం ఇంగ్లీషు కాకుండా మరో భాష అయితే ఆ భాషా మాధ్యమంలో పరీక్షలు రాయవచ్చు.

6.6. కోర్సువర్క్ పరీక్షలను మరియు మూల్యాంకనాన్ని విశ్వవిద్యాలయంలో ఆ సమయంలో పిజి కోర్సుల నిర్వహణ మరియు మూల్యాంకనలు నిర్వహిస్తున్న పద్ధతిలోనే నిర్వహించవలసి ఉంటుంది.

6.7.ఒక వేళ అభ్యర్ధి వరుసగా రెండుసార్లు పిహెచ్.డి కోర్సు వర్క్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని పక్షంలో పిహెచ్.డి ప్రవేశం రద్దు అవుతుంది. దీనికోసం, విద్యార్ధి పిహెచ్.డిలో ప్రవేశం పొందిన తర్వాత విశ్వవిద్యాలయం నిర్వహించిన మొదటి రెండు పరీక్షలను పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్ధి ఏ బ్యాచ్ లో పరిగణింపబడతారో ఆ బ్యాచ్ విద్యార్ధులకు వరుసగా జరిగిన రెండు పరీక్షలు పరిగణిస్తారు.

5.2. అంశకాలిక పిహెచ్.డి పరిశోధకులు

ఎ.      పిహెచ్.డి ప్రవేశానికి అర్హతపొంది, పూర్తికాలిక పరిశోధకులు కానివారు అంశకాలిక  పరిశోధకులుగా పరిగణింపబడతారు.

బి.      అంశకాలిక పరిశోధకులకు పిహెచ్.డి.కోర్సు కాలపరిమితి పీఠాధిపతి నుంచి ప్రవేశపత్రం పొందిన రోజు నుంచి అయిదు (5) సంవత్సరాలు.

సి.      అంశకాలిక పరిశోధకులు పిహెచ్.డి. కోర్సులో ప్రవేశం తీసుకుంటున్నపుడే తమయజమాని నుంచి అనుమతి పత్రాన్ని సమర్పించాలి.

డి.      అంశకాలిక పరిశోధకులు ప్రవేశం తీసుకుంటున్నపుడే తప్పనిసరిగా కోర్సువర్క్ తరగతులకు హాజరుకావడానికి కోర్సువర్క్ తరగతులకు హాజరు కావడానికి వీలుగా కనీసం ఆరు (6) మాసాలపాటు సెలవు తీసుకుంటామని తమ హామీ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది.

 ఇ.      అంశకాలిక పరిశోధకులు హాస్టల్ వసతికి అర్హులు కారు.

ఎఫ్.    ఏ అభ్యర్ధి అయినా తమ పరిశోధనను తగిన కారణం ఉన్నపుడు తమ పరిశోధన పూర్తికాలిక కోర్సును అంశకాలిక కోర్సుగా గాని, అంశకాలిక కోర్సును పూర్తికాలికకోర్సుగా గాని పీఠాధిపతి అనుమతితో మార్చుకోవచ్చు. ఇలా మార్చుకున్న వారికి పిహెచ్.డి కాలవ్యవధి నాలుగు (4) సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మరియు అలా మారిన వారికి హాస్టల్ సౌకర్యం ఉండదు.

  జి.      పిహెచ్.డిలో పూర్తికాలకంగా కానీ, అంశకాలికంగా గానీ చేరిన అభ్యర్ధి కాలపరిమితిలోనా ఈ విశ్వవిద్యాలయంలో గానీ, మరే ఇతర విశ్వద్యాలయంలో గానీ ఏవిధమైన రెగ్యులర్ /దూరవిద్య కోర్సులో చేరకూడదు. అలా చేరిన పక్షంలో పిహెచ్.డి ప్రవేశం రద్దవుతుంది.

7. ప్రగతి నివేదికలు

 7.1   అభ్యర్ధి కోర్సు వర్కును, పిహెచ్.డి కోర్సు వర్క్ పరీక్షను, పూర్తి చేసిన తర్వాత, ప్రతి ఆరు    నెలలకు పరిశోధన పర్యవేక్షకుని ద్వారా పీఠాధిపతికి ప్రగతి నివేధికను సమర్పించాలి. ఈ   నివేదికలో పూర్వం ఆ విషయంలో జరిగిన పరిశోధనల సమీక్ష, సేకరించిన సమాచారం,రూపొందించుకున్న విధానాలు, పరిశోధన ప్రగతి, చేసిన పని గురించిన చర్చ, కనుగొన్న విషయాలు మొ. ఉండాలి.  అవసరమైనట్లయితే ఈ ప్రగతి నివేదికను పీఠాధిపతి పున:పరిశీలనకోసం శాఖకు పంపించవచ్చు.

7.2. అభ్యర్ధి వరుసగా రెండుసార్లు అర్ధ సంవత్సర నివేదికలు సకాలంలో సమర్పించకపోయినా మరియు లేదా రెండు అర్ధ సంవత్సరాల కాలంలో అభ్యర్ధి ప్రగతి సంతృప్తికరంగా లేకపోయినా   సంబంధిత పరిశోధన పర్యవేక్షకునితో సంప్రదించి డిపార్టుమెంటు రిసెర్చి కమిటీ అభ్యర్ధి ప్రవేశం రద్దు చేయమని పీఠాధిపతికి సిఫారసు చేయవచ్చు.

8. పరిశోధన సదస్సులో పత్రసమర్పణలు:

పిహెచ్.డి. కోర్సు కాలపరిమితిలో నమోదు చేసుకున్న అభ్యర్ధి శాఖలో మూడు సదస్సుల్లో పరిశోధన పత్రాలు సమర్పించాలి. మొదటి సదస్సు కోర్సువర్క్ పరీక్ష్ ఉత్తీర్ణులైన తర్వాత ఉంటుంది. దీనిని ‘పరిశోధన రూపకల్పన’ (Research Design Seminar) సదస్సుగా వ్యవహరిస్తారు. ఇందులో విద్యార్ధి చేపట్టిన అంశానికి సంబంధించి జరిగిన పూర్వ పరిశోధనల సమీక్షను తన పరిశోధన ప్రణాళికను గురించి పత్ర సమర్పణ చేయ్యాలి. రెండవ సదస్సు ‘పరిశోధన ప్రగతి సదస్సు’ (Research Progress Seminar). దీనిలో అభ్యర్ధి తన పరిశోధనలో ప్రగతికి సంబంధించి పత్ర సమర్పణ చేయాల్సి ఉంటుంది. చివరి సదస్సు ‘సిద్ధాంత వ్యాస సమర్పణ పూర్వ సదస్సు’ (Pre-submission Seminar). ఇది పరిశోధకుడు తన సిద్దాంత వ్యాసం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నపుడు జరుగుతుంది. ఇందులో తన సిద్ధాంత వ్యాసాన్ని సమగ్రంగా వివరించి, శ్రోతల స్పందనలు, వ్యాఖ్యలు, సూచనలు స్వీకరించి వీటిని సిద్ధాంత వ్యాసం తుదిప్రతిలో చేర్చవలసి ఉంటుంది. ఈ సదస్సులో పిహెచ్.డి సిద్ధాంత వ్యాసం ముసాయిదా ప్రతి అందుబాటులో ఉండాలి. ఈ సదస్సు సిద్ధాంత వ్యాసం సమర్పించడానికి ముందు మూడు (3) మాసాలలోగా ఉంటుంది. పైన పేర్కొన్న అన్ని సదస్సుల ఫలితాలను, నిర్వహణను శాఖాధిపతి, పాఠ్యనిర్ణాయక మండలి అధ్యక్షులు,, పరిశోధన పర్యవేక్షకులు ధ్రువీకరించవలసి ఉంటుంది. ఈ మూడు సదస్సులు పరిశోధన రూపకల్పన, పరిశోధన ప్రగతి, సిద్ధాంతవ్యాస సమర్పణ పూర్వ సదస్సు ధ్రువీకరణ పత్రాలను సిద్ధాంత వ్యాసం సమర్పించేటప్పుడు దానితో జతపరచాలి. ఒక్కొక్క సదస్సుకు మధ్య ఆరు (6) నెలల వ్యవధి తప్పనిసరిగా ఉండాలి. ‘సిద్ధాంత వ్యాస సమర్పణ పూర్వ సదస్సు’ (Pre-submission Seminar) తదుపరి సిద్ధాంత గ్రంథం సమర్పణకు 30 రోజుల వ్యవధి ఉండాలి.

 

9. పిహెచ్.డి. సిద్ధాంత వ్యాస శీర్షిక సవరణ:

9.1. పరిశోధన శీర్షిక మార్చుకోవడానికి పీఠాధిపతి అనుమతించవచ్చు. దీనికి పరిశోధన విద్యార్ధి అభ్యర్ధనను పర్యవేక్షకులు సంబంధితశాఖ పరిశోధన కమిటీ తగిన కారణాలతో సిఫారసు చేయవలసి ఉంటుంది. అయితే, ఇటువంటి,సవరణను ఒక సారి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఈ సవరణ పరిశోధన ప్రగతి సదస్సు కంటె ముందుగానే జరగాలి.

9.2. సిద్ధాంత వ్యాసం శీర్షిక మార్చుకోవాలనుకునే విద్యార్ధి దీనికోసం నిర్దేశిత రుసుమును చెల్లించవలసి ఉంటుంది.

 

10. పరిశోధన కాలపరిమితి పొడిగింపు:

10.1.పిహెచ్.డి విద్యార్ధి తన రిజిస్ట్రేషన్ కాలవ్యవధిని పొడిగించవలసిందిగా అభ్యర్ధించవచ్చు.ఈ   పొడిగింపుకు ఒక్కొక్క సంవత్సరం చొప్పున గరిష్ఠంగా రెండు పొడిగింపులు (రెండుసంవత్సరాలు) వరకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆ అభ్యర్ధి నిరంతర పరిశోధనలో నిమగ్నమై ఉన్నారని, గత సంవత్సరాలలో వారి పరిశోధన ప్రగతి సంతృప్తికరంగా ఉందని పర్యవేక్షకులు సిఫారసు చేయాలి. అంతేగాక గ్రంథాలయం, శాఖ/కళాశాల, హాస్టల్ లోవిద్యార్ధికి బకాయిలు లేవని  సంబంధిత అధికారులు ధ్రువీకరించాలి.

10.2. పొడిగింపును కోరే విద్యార్ధి లిఖితపూర్వకంగా తన అభ్యర్ధనను అంతవరకు జరిగిన పరిశోధన ప్రగతి నివేదికను, నిర్ధారిత రుసుముతో సహా పీఠాధిపతికి సమర్పించాలి. దీనినిపర్యవేక్షకులు, శాఖాధిపతి, పాఠ్యనిర్ణాయక మండలి అధ్యక్షులు సిఫారసు చేయాలి. ఈ అభ్యర్ధన కాలపరిమితి ముగియడానికి రెండు నెలల ముందే సమర్పించాలి లేని పక్షంలో అభ్యర్ధనను నిరాకరించవచ్చు.

10.3. పూర్తికాలిక/అంశకాలిక పిహెచ్.డి పరిశోధకుల రిజిస్ట్రేషన్ ఆరు (6) సంవత్సరాలు ముగిసిన తర్వాత రద్దవుతుంది.

10.4. రీ-రిజిస్ట్రేషన్ కాలపరిమితి ఒక (1) సంవత్సరం. రీ-రిజిస్ట్రేషన్ ఫీజును రూ.5,000/-లు, ఆ విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లింపు చేయవలసివుంటుంది.

10.5. మహిళ అభ్యర్ధులు/దివ్యాంగులు (40% కంటే ఎక్కువ వైకల్యం) సిద్ధాంత గ్రంథం సమర్పించడానికి ఎం.ఫిల్ ఒక సంవత్సరం,  పిహెచ్.డి. 2 సంవత్సరాలు అదనంగా సడలింపు.

11. కనిష్ఠంగా ప్రచురించవలసిన పరిశోధన పత్రాలు:

 పిహెచ్.డి. అభ్యర్ధి సిద్ధాంతవ్యాసం సమర్పించే ముందు దానికి సంబంధించిన కనీసం రెండు పరిశోధన పత్రాలను గుర్తింపు పొందిన/ప్రామాణిక పరిశోధన జర్నల్స్ లో ప్రచురించాలి. ఈ ప్రచురణ ప్రతులను పరీక్షకులకు రుజువుగా సమర్పించాలి. మరియు వీటిని సిద్ధాంత వ్యాసంలో అనుబంధంలో చేర్చవలసి ఉంటుంది.

12. పిహెచ్.డి ప్రవేశం / నమోదు రద్దు:

12.1. అభ్యర్ధి ప్రవేశ ఉత్తర్వలో పేర్కొన్న షరతులన్నిటినీ సకాలంలో సంతృప్తిపరచకపోతే,   పీఠాధిపతి ఆ అభ్యర్ధి ప్రవేశాన్ని రద్దు చేయవచ్చు.

12.2. కింద తెలిపినా ఒకటి లేదా అంతకు ఎక్కువ కారణాలతో పరిశోధన పర్యవేక్షకులు గాని,  శాఖాధిపతిగాని అభ్యర్ధి ప్రవేశాన్ని రద్దు చేయమని పీఠాధిపతికి సిఫారసు చేయవచ్చు.

  •         ఎ)   వరుసగా రెండు అర్ధ సంవత్సర ప్రగతి నివేదికల్లోనూ అభ్యర్ధి పరిశోధన ప్రగతి సంతృప్తికరంగా   లేనపుడు, లేదా అసలు వరుసగా రెండు నివేదికలు సమర్పించనపుడు.
  •        బి)   అభ్యర్ధి తన పరిశోధనను మానివేసినపుడు మరియు /లేదా పీఠాధిపతి అనుమతిని లిఖితపూర్వకంగా తీసుకోకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నపుడు, లేదా పీఠాధిపతి  రాతపూర్వక అనుమతి లేకుండా ఉద్యోగంలో చేరినపుడు.
  •        సి)  అభ్యర్ధి విశ్వవిద్యాలయంలో గానీ, బయటగానీ అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువయితే, అటువంటి అభ్యర్ధి ప్రవేశాన్ని విశ్వవిద్యాలయం రద్దు చేయవచ్చు.
  •       డి)  అభ్యర్ధి పరిశోధనలో అనుచిత అక్రమ పద్ధతులకు, గ్రంథచౌర్యానికి పాల్పడినట్లురుజువైన పక్షంలో, అప్పటికే అతని పరీక్ష  ఫలితం ప్రకటింపబడినప్పటికీ, పరీక్షలనియంత్రణాధికారి దాన్ని నిలిపివేయచ్చు లేదా రద్దు చేయవచ్చు.

13. పిహెచ్.డి సిద్ధాంత వ్యాస సమర్పణ:

ఎ)     పూర్తికాలిక పరిశోధకుడు ప్రవేశం పొందిన మూడు సంవత్సరాలకు, అంశకాలిక పరిశోధకుడు ప్రవేశం పొందిన నాలుగు సంవత్సరాలకు తమ సిద్ధాంత వ్యాసం సమర్పించడానికి అర్హులు.

   ఎ.1)   ఎం.ఫిల్ ఉన్నట్లయితే ఒక సంవత్సరం ముందుగా సిద్ధాంత గ్రంథం సమర్పించవచ్చు.

      బి)    పిహెచ్.డి ప్రవేశ నమోదు కాల వ్యవధి అయిపోయిన/రద్దు అయిన అభ్యర్ధి సిద్ధాంత వ్యాసం సమర్పించడానికి అర్హులు కారు, అయితేఅకడమిక్ సెనెట్ స్థాయి సంఘం   అనుమతించినట్లయితే సిద్ధాంతవ్యాసం సమర్పించవచ్చు.

      సి)   పరిశోధక విద్యార్ధి తన సిద్ధాంత వ్యాసాన్ని ఈ ప్రక్రియకోసం విశ్వవిద్యాలయం నిర్దేశించిన అన్ని నిబంధనలనూ పాటిస్తూ, అవసరమైన అన్ని పత్రాలను, నో డ్యూస్ సర్టిఫికెట్ నూ దానికి జతపరచి పరీక్షల నియంత్రణాధికారికి సమర్పించవలసి ఉంటుంది.

    డి)  పరిశోధన పర్యవేక్షకులు సిద్ధాంత వ్యాస సారాంశాన్ని (synopsis) 6 ప్రతులతో పాటు, పరిశోధన సంబంధిత అంశానికి చెందిన 12 మంది నిపుణుల జాబితా (10 ప్రతులను)‘రహస్యం’ (confidential) అని రాసిన కవరులో పెట్టి పాఠ్యనిర్ణాయక మండలి అధ్యక్షుడికి సిద్ధాంత వ్యాసం సమర్పణకు కనీసం 3 నెలల ముందు సమర్పించాలి. పాఠ్యనిర్ణయక మండలి అధ్యక్షులు, మండలి సభ్యులతో చర్చించి, వారి ఆమోదంతో నిపుణుల పేర్లను ఖరారు చేస్తారు. సూచించిన 12 మంది నిపుణులలో 9 మంది తెలంగాణ రాష్ట్రానికి బయటివారై ఉండాలి. ఒక సంస్థ నుంచి ఒకరిని మాత్రమే సూచించాలి. నిపుణుల జాబితాలో వారి పేర్లతో పాటు వారి పూర్తి చిరునామా, ఇ.మెయిల్ ఐ.డి., టెలిఫోన్ నెంబర్లను ఇవ్వాలి

   ఇ)   పాఠ్య నిర్ణాయక సంఘం అధ్యక్షుడు ఆమోదించిన 12 మంది నిపుణుల పేర్లున్న జాబితాను సిద్ధాంత వ్యాస సారంశం 6 ప్రతులతో పాటు తదుపరి చర్యకోసం పరీక్షల నియంత్రణాధికారికి 15 రోజుల్లోగా పంపవలసి ఉంటుంది.  ఈ నిపుణు జాబితాలో అదే విశ్వవిద్యాలయంలో పర్యవేక్షకులుగా గుర్తింపు పొందిన అధ్యాపకులుగానీ, అభ్యర్ధి బంధువులుగాని ఉండకూడదు. నిపుణుల పేర్లు ఆమోదం పొందిన తర్వాత 6 నెలల్లోగా అభ్యర్ధి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించకపోతే, ఆ జాబితా రద్దవుతుంది. మళ్ళీ కొత్తగా నిపుణుల జాబితాను రూపొందించవలసి ఉంటుంది.

14. పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం మూల్యాంకన/ ఫలితాన్ని నిర్ణయించడం

    ఎ)    ఉపాధ్యక్షుల వారు ఎంపిక చేసిన, ఆ విశ్వవిద్యాలయానికి చెందని ముగ్గురు నిపుణులు సిద్ధాంత వ్యాసాన్ని మూల్యాంకన చేసి ఫలిత నిర్ణయం చేస్తారు.

    బి)     పరీక్షల నియంత్రణాధికారి నిపుణులకు వారి నియామకాన్ని తెలియజేస్తూ, సిద్ధాంతవ్యాస సారాంశాన్ని పంపి, నిపుణులుగా వ్యవహరించడానికి వారి అనుమతి కోరుతారు. వారి  అనుమతి మేరకు సిద్ధాంత గ్రంథాన్ని సంబంధిత నిపుణులకు పంపుతూ, నిర్దేశిత నమూనాలోవారి నిర్ణయాన్ని (report) పంపమని కోరతారు.

    సి)     నిపుణుల నుంచి మూడు (3) నివేదికలు అందిన తదుపరి పిహెచ్.డి. డిగ్రీ అవార్డుచేయడానికి ముందు మౌఖిక పరీక్ష (Viva Voce) జరపడానికి దిగువ పేర్కొన్న సూచనలు పాటించవలసి ఉంటుంది.

  1. ముగ్గురు నిపుణుల నివేదికల్లోనూ సిద్ధాంత వ్యాసాన్ని యథాతథంగా ఆమోదించవచ్చు అనే  సిఫారసు ఉన్నట్లయితే పరిశోధకుడికి మౌఖిక పరీక్షకు ఆమోదం లభిస్తుంది.
  2. ముగ్గురిలో ఒకరు లేదా ఇద్దరు సవరణలు సూచించిన పక్షంలో సవరణ చేసిన తర్వాత మళ్ళీ  ఆ ముగ్గురికే సిద్ధాంత వ్యాసం పంపవలసి ఉంటుంది.
  3. ముగ్గురిలో ఒక నిపుణుడు సిద్ధాంత వ్యాసాన్ని తిరస్కరించిన పక్షంలో ఆమోదం పొందిన 12    మంది నిపుణుల్లో మరొకరికి సిద్ధాంత వ్యాసాన్ని పంపడం జరుగుతుంది. ఈ నిపుణుడు కూడాతిరస్కరిస్తే, సిద్ధాంత వ్యాసం తిరస్కరించబడి పిహెచ్.డి నమోదు రద్దు అవుతుంది.
  4. ఇద్దరు లేదా మొత్తం ముగ్గురు పరీక్షకులు తిరస్కరించిన పక్షంలో సిద్ధాంత వ్యాసం   తిరస్కరించబడి వారి పిహెచ్.డి నమోదు కూడా రద్దు అవుతుంది.

 డి)  సిద్ధాంత వ్యాసం సమర్పించిన నాటి నుంచి మూడు నెలల్లోగా ఏ నిపుణుడి నుంచి అయినా నివేదిక అందని పక్షంలో, సిద్ధాంత వ్యాసాన్ని, అదే పరీక్షకుల జాబితాలోని మరొకరికి    పంపడం జరుగుతుంది.

ఇ)  నిపుణులు స్వల్ప మార్పులను సూచించిన పక్షంలో ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణాధికారి మౌఖిక పరీక్షకు ముందే పర్యవేక్షకుడికి తెలియజేయాలి. ఈ సవరణలను సిద్ధాంత వ్యాసంలో   చేర్చి, ఈ సవరణలు, చేర్పుల పట్టికను సిద్ధాంత వ్యాసానికి అనుబంధంగా చేర్చి, మౌఖిక పరీక్ష    సమయంలో నిపుణులకు చూపించవలసి ఉంటుంది.

15. పిహెచ్.డి. మౌఖిక పరీక్ష:

15.1. సిద్ధాంత వ్యాసం పిహెచ్.డి డిగ్రీ అవార్డుకు అర్హమని ముగ్గురు నిపుణులు (adjudicators) సిఫారసు చేసిన తరువాత మౌఖిక పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షల నియంత్రణాధికారి, నిపుణుల మండలిని ఏర్పాటు చేసి, మౌఖిక పరీక్ష నిర్వహించవలసిందిగా పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షుడిని కోరతారు.

15.2. పిహెచ్.డి మౌఖిక పరీక్ష సంబంధిత శాఖలో నిపుణుల మండలిచే నిర్వహించబడుతుంది. ఇందులో ఉండవలసిన అయిదుగురు సభ్యులు.

  ఎ)      పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షుడు

  బి)      శాఖాధిపతి

  సి)       సిద్ధాంత గ్రంథ విషయంలో నిపుణులైన, అదే శాఖలో పనిచేస్తున్న గుర్తింపు పొందిన పర్యవేక్షకులలో పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సూచించిన నలుగురు పర్యవేక్షకులలో ఉపాధ్యక్షులు ఎంపిక చేసిన ఇద్దరు.

  డి)     విద్యార్ధి పరిశోధన పర్యవేక్షకులు. వీరే మౌఖిక పరీక్షకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు అయితే విశ్వవిద్యాలయాలు పైన పేర్కొన్న విధంగా కాకుండా, వారి వారి నియమ నిబంధనల ననుసరించి పరీక్షకుల (నిపుణుల) మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు.

15.3. మౌఖిక పరీక్షకుల మండలిలో చేర్చడానికి అర్హులైన అధ్యాపకులు శాఖలో లేనట్లయితే  బయటి  నుంచి ఒక నిపుణుడిని ఆహ్వానించవచ్చు.

15.4. మౌఖిక పరీక్ష నిర్వహణకు నిపుణుల మండలిని ఏర్పరిచిన తర్వాత పాఠ్యప్రణాళిక సంఘం  అధ్యక్షుడు రెండు సిద్ధాంత వ్యాస ప్రతులకు తెప్పించి, మౌఖిక పరీక్ష నిర్వహించడానికి  నిపుణులకు అందుబాటులో ఉంచాలి.

15.5. మౌఖిక పరీక్షకు శాఖలోని ఇతర పరిశోధకులు, విద్యార్ధులు, అధ్యాపకులు హాజరుకావచ్చు.  ఆ శాఖకు చెందిన పాఠ్య ప్రణాళికామండలి అధ్యక్షుడు మౌఖిక పరీక్షకు వారం రోజుల ముందుగా మౌఖిక పరీక్ష తేదీ, సమయం నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.

15.6. మౌఖిక పరీక్ష నిర్వహించే నిపుణుల మండలి పిహెచ్.డి. డిగ్రీని ప్రదానం చేయమని సిఫారసు  చేయవచ్చు లేదా తగిన కారణాలు చూపుతూ మరోసారి మౌఖిక పరీక్ష నిర్వహించాలని కూడా సిఫారసు చేయవచ్చు. రెండోసారి నిర్వహించే మౌఖిక పరీక్షను అదే నిపుణుల మండలి  మొదటి మౌఖిక పరీక్ష జరిగిన తేదీ నుంచి రెండు నెలలు తర్వాత, ఆరు నెలలలోపు నిర్వహించవలసి ఉంటుంది. సంబంధిత శాఖకు చెందిన పీఠాధిపతి ఈ రెండో పరీక్షలో పాల్గొని తన అభిప్రాయాలను నేరుగా ఉపాధ్యక్షులకు పంపుతారు.

16. పిహెచ్.డి ఫలితాల ప్రకటన

16.1. మౌఖిక పరీక్ష పూర్తవగానే, మౌఖిక పరీక్ష పరీక్షకులు నివేదిక, నిపుణుల నివేదికతోపాటు వెంటనే ‘రహస్యం’ అని రాసిన కవరులో పెట్టి పరీక్షల నియంత్రణాధికారికి పంపాలి.

16.2. మౌఖిక పరీక్ష ముగిసిన తరువాత, అందులో ప్రస్తావించిన సవరణలు కూడా సిద్ధాంత గ్రంథంలో చేర్చిన తర్వాత అభ్యర్ధి రెండు హార్డబౌండు కాపీలు, 2 సి.డి. ల రూపంలో రెండు కాపీలు సమర్పించవలసి ఉంటుంది. ఈ హార్డ్ బౌండు సిద్ధాంత గ్రంథాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా విశ్వవిద్యాలం గ్రంథాలయంలో ఒక ప్రతి, శాఖకు చెందిన సెమినార్ గ్రంథాలయంలో మరో ప్రతి ఉంచాలి. సిద్ధాంత వ్యాస సి.డి.ని పిహెచ్.డి ప్రకటించిన 30 రోజుల్లోగా న్యూఢిల్లీలోని యు.జి.సి కార్యాలయానికి పంపాలి. దానితో యు.జి.సి వారు ఇన్ ఫ్లిబ్ నెట్ ద్వారా అన్ని విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు అందుబాటులోకి తెస్తారు. మరో సి.డి. ప్రతి ద్వారా విశ్వవిద్యాలంయ వెబ్ సైట్ లో సిద్ధాంత గ్రంథాన్ని ప్రచిస్తారు. ఈ విధంగా అభ్యర్ధి రెండు హార్డ్ బౌండ్ ప్రతులను, రెండు సి.డి.లను సమర్పించిన అనంతరమే పరీక్షల నియంత్రణాధికారి పిహెచ్.డి డిగ్రీ ప్రదానం చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేస్తారు.

గమనిక:     పైన పేర్కొన్న నియమ నిబంధనలలో పేర్కొనబడని, మిగిలిన విషయాలను సంబంధిత విశ్వవిద్యాలయం స్థాయి సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఆయా విషయాలలో స్థాయి సంఘానిదే తుది నిర్ణయం.