University Profile

University Profile

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాదేశిక భాషల అభివృద్ధిపట్ల దృష్టి సారించాయి. 1985 డిశంబర్‌ 2 న దేశంలోనే రెండవ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. బోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణసేవ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషని, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రని పరిరక్షించుకోవడం, అభివృద్ధిపరచుకోవడం, వ్యాపింపచేయడం లక్ష్యంగా ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి రంగాల్లో విశ్వవిద్యాలయం ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రంగా పనిచేయడం, తెలుగును ఆధునిక విజ్ఞాన భాషగాను, బోధన భాషగానూ అభివృద్ధిపరచడం వంటివి ఈ విశ్వవిద్యాలయం ఏర్పరచుకున్న కొన్ని ముఖ్యలక్ష్యాలు. 2022-23 విద్యా సంవత్సరం నుండి P.G., U.G., P.G.Diploma, Diploma and Certificates లో మరికొన్ని కొత్త ప్రొగ్రాంలను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం 33 సబ్జెక్టులలో 74 సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చి ప్రొగ్రాంలను అందిస్తున్నది.

విశ్వవిద్యాలయంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ డిజైన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ యోగ కొత్తగా ఏర్పాటు చేయడమైనది.

దేశంలోని విశ్వవిద్యాలయాలను, కళాశాలలను మదింపు చేసే నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ సభ్యుల బృందం 2019 మార్చిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఇక్కడి విద్యాత్మక, పరిపాలనాపరమైన కార్యక్రమాలను మదింపుచేసి 2019 మార్చిలో విశ్వవిద్యాలయానికి ‘బి’ గ్రేడును ప్రకటించింది. విశ్వవిద్యాలయంలోని రెగ్యులర్ ప్రొగ్రాంలను బాచుపల్లి ప్రాంగణంలోనే తరగతులు  నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులర్ ప్రొగ్రాంలకు హాస్టల్ వసతి బాచుపల్లి ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ప్రొగ్రాంలు నాంపల్లి ప్రాంగణంలోనే నిర్వహించడం జరుగుతుంది.

నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ సభ్యుల సూచనల మేరకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న ‘ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌’ (సిబిసిఎస్‌) ను  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అమలుపరుస్తున్నది. ఈ విధానంలో తనకు అభిరుచి ఉన్న, తన అభివృద్ధికి తోడ్పడతాయనుకునే ప్రొగ్రాంలను ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థికి ఉంటుంది. విద్యార్థి తను చేరిన సబ్జక్టులోని ప్రొగ్రాంలనే కాకుండా ఇతర శాఖలవారు అందిస్తున్న సబ్జక్టులలోని ప్రొగ్రాంలను కూడా పరిమిత సంఖ్యలో చేసే అవకాశం  సిబిసిఎస్‌ లో ఉంటుంది. ఈ పద్ధతిలో విద్యార్థి చేసిన ప్రొగ్రాంలకు ప్రపంచంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో గుర్తింపు పెరుగుతుంది.

విశ్వవిద్యాలయ పరిపాలనలో పారదర్శకతను పెంచడంకోసం అలాగే పనులను సులువుగా, శీఘ్రంగా చెయడంకోసం ముఖ్యవిభాగాలైన ఆర్ధిక, పరిపాలన, విద్యాత్మక, పరీక్షలు, దూరవిద్య వంటి వాటిని ఈ విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయిలో కంప్యూటరైజేషన్ చేసే దిశగా విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది.

విశ్వవిద్యాలయంలో రెగ్యులర్, సాయంకాలం ప్రొగ్రాంలు, దూరవిద్య ప్రొగ్రాంలు ఉన్నాయి. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళల పట్ల ఆసక్తితో 2022-23 విద్యా సంవత్సరంలో వివిధ ప్రొగ్రాంలలో చేరదలచుకున్న విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్వాగతం పలుకుతోంది.

తెలుగు విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాలలోని 13 ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు/ పాఠశాలలు నిర్వహించే  ప్రొగ్రాంల పరీక్షలను నిర్వహిస్తుంది. 2022-23 విద్యా సంవత్సరం నుండి ప్రైవేట్ కళాశాలలు/ పాఠశాలలు/ సంస్థలు నిర్వహించే ప్రొగ్రాంలకు (కోర్సులు) అఫిలియేషన్ ఇచ్చే విషయంలో క్రీయాశీలకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.