Library
విశ్వవిద్యాలయ గ్రంథాలయం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కేంద్ర గ్రంథాలయం హైదరాబాదులోని తెలుగు భవనంలో ఉంది. అలాగే శ్రీశైలం, రాజమండ్రి, వరంగల్, కూచిపూడిలలో పీఠాలవారీగా ప్రాంగణ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి.
గ్రంథాలయ నిబంధనల మేరకు ఆయా ప్రొగ్రాంలలో చేరిన పరిశోధక విద్యార్థులకు 5 టికెట్లను, పి.జి. విద్యార్థులకు నాలుగు టికెట్లను, ఇతర విద్యార్థులకు మూడు టికెట్లను గ్రంథాలయం జారీచేస్తుంది. విద్యార్థుల కోర్సు పూర్తయి సిద్ధాంత గ్రంథ ప్రతులు సమర్పిస్తున్నప్పుడు గానీ, గ్రంథాలయ ధరావత్తు వాపసు తీసుకోవాలనుకున్నప్పుడు గానీ తప్పనిసరిగా గ్రంథాలయం నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్‌ను పొందాలి. గ్రంథాలయం నుంచి తీసుకున్న పుస్తకాలను గడువు తేదీ లోపల గ్రంథాలయానికి వాపసు చేయాలి లేదా గడువు పొడిగించుకోవాలి. గడువు తేదీ దాటితే గ్రంథాలయ నిబంధనల మేరకు అపరాధ రుసుము వసూలు చేయడమవుతుంది. అంశకాలిక అభ్యర్థులకు గ్రంథాలయ టిక్కెట్లు జారీచేయడం జరగదు. కాని వారు పరిశోధన విషయమై గ్రంథాలయాన్ని సందర్శించవచ్చు.
పనివేళలు:
కేంద్ర గ్రంథాలయం ప్రతి రోజు ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు పనిచేస్తుంది. సెలవు రోజులలో (రెండవ శనివారం, ఆదివారం) ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పనిచేస్తుంది.
పఠన సామగ్రి:
తెలుగు భాష, సాహిత్యం, లలితకళలు, జ్యోతిషం, జర్నలిజం మొదలైన విషయాలపై గ్రంథాలయంలో విలువైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే కృష్ణాపత్రిక, భారతి, కళ, నాట్యకళ వంటి పాత పత్రికలు, ఇతర ప్రత్యేక సంచికలు అపురూపమైన అనేక గ్రంథాలు పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడేవి లభ్యమవుతున్నాయి.
ప్రత్యేక సంకలనాలుః
కేంద్ర గ్రంథాలయంలో 28 అరుదైన తాళ పత్ర గ్రంథాలుండడం విశేషం. వీటికి తోడుగా మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ లేఖల సంపుటాలు గ్రంథాలయానికి ఉన్న అపూర్వ సంపదగా పేర్కొనవచ్చు. అలాగే ఆంధ్రఫ్రదేశ్ రాష్ట్ర అభిలేఖాగారం (ఆర్కీవ్స్) వారి సహకారంతో కృష్ణాపత్రికల మైక్రోఫిల్మ్‌ను, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (న్యూఢిల్లీ) వారి నుంచి ఆంధ్రపత్రిక మైక్రోఫిల్మ్‌ను ( ఏప్రిల్ 1914 నుంచి డిసెంబర్, 1940 వరకు) సేకరించి భద్రపరచడం మరో విశేషం.
అధునాతన సామగ్రి:
మైక్రోఫిల్మ్‌ను ఉపయోగించుకోవడానికి వీలుగా మైక్రోఫిల్మ్ రీడర్ సౌకర్యం ఉంది. అలాగే, చదువరులు తమకు అవసరమనిపించే పత్రాలను, నిర్ణీత రుసుం చెల్లించి, జిరాక్స్ చేయించుకునేందుకుగాను జిరాక్స్ యంత్రాన్ని సమకూర్చటమైంది.
కంప్యూటరీకరణ :
కేంద్ర గ్రంథాలయాన్ని కంప్యూటరీకరణ చేయటానికి ఇన్‌ఫ్లిబ్‌నెట్ వారి సహాయంతో తొమ్మిది కంప్యూటర్లను సమకూర్చటం జరిగింది. అలాగే, ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాలకు డేటాబేస్ తయారుచేయటం పూర్తయింది. భవిష్యత్తులో గ్రంథాలయ కార్యకలాపాలనన్నింటిని కంప్యూటర్ల ద్వారానే నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతున్నది.
గమనిక:
విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన విద్యార్థులు గ్రంథాలయం గురించి విపులంగా తెలుసుకోవడానికి ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయం – ఓ పరిచయం’ అనే కరదీపికను గ్రంథాలయం నుంచి ఉచితంగా పొందవచ్చును.