Vision & Mission
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు వంటి అంశాల సర్వతోముఖాభివృద్ధికోసం కింది లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు నిరంతరం కృషి సల్పుతున్నది.
- తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి రంగాల్లో విశ్వవిద్యాలయం ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా పనిచేయడం
- తెలుగు భాషా సాహిత్య చరిత్ర, సంస్కృతులనూ, అందుకు సంబంధించిన విషయాలనూ అధ్యయనం చేయదలచిన భారతదేశంలోని వారికి, విదేశాల్లోని వారికి శిక్షణ ఇవ్వడం
- కళలు, సంస్కృతి, సంగీతం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద విజ్ఞానం, జానపద కళలు, జ్యోతిషం, పురావస్తు శాస్త్రం, సాహిత్యం, వ్యాకరణం, భాషా శాస్త్రం, చరిత్ర, మతం, వేదాంతం, వైద్యం, ఇంజనీరింగు, విజ్ఞాన శాస్త్రాలు, హస్తకళలు మొదలైన వాటిల్లో ఉన్నత అధ్యయనానికీ, పరిశోధనకూ వీలు కల్పించడం
- విశ్వవిద్యాలయ లక్ష్యాలకు అనుగుణమైన అవసరాల ప్రకారం తెలుగు పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువదించడం, ఇతర భాషల్లోని పుస్తకాలను తెలుగులోకి అనువదించడం
- తెలుగుభాషకు, సంస్కృతికి, చరిత్రకు సంబంధించిన శిలాశాసనాలను అన్వేషించడం, వాటిని సంకలనం చేయడం, పరిశోధన ఆధారంగా వెల్లడైన అంశాలతో వాటిని ప్రచురించడం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో తెలుగు మాట్లాడేవారు, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో నివసిస్తూ తెలుగు మాట్లాడేవారు, పరిశ్రమలు, ఇతర వృత్తులకు సంబంధించి ఉపయోగించే తెలుగు మాటలు, నుడికారం, వ్యావహారిక పదజాలం, కొత్తగా ఎప్పటికప్పుడు రూపొందే పదాలను సంకలనం చేయడం, ప్రచురించడం
- ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రాచీన తెలుగు సాహిత్యంపై పరిశోధనలకు వీలు కల్పించడం
- తెలుగును ఆధునిక విజ్ఞాన భాషగానూ, బోధన భాషగానూ అభివృద్ధి పరచడం. భాషాభివృద్ధి గురించిన పరిశోధనకు సదుపాయాలు కలుగచేయడం, కార్యవిధానాలను నిర్ణయించడం, అందుకు తగిన పద్ధతులను రూపొందించడం.